మూడు మార్లు శ్రీరామ నామ జపం చేయడం

మూడు మార్లు శ్రీరామ నామ జపం చేయడం

శ్రీరామ నామ జపం చేయడం అంటే పూర్వజన్మ సుకృతం అంటారు. మూడు మార్లు శ్రీరామ నామ జపం చేయడం అంటే వేయి విష్ణు నామాలు పలికినట్టేనని పరమశివుడు, పార్వతీదేవికి తెలియజేసినట్టు పురాణాలు చెబుతున్నాయని పెద్దలు అంటారు.

భక్తితో ”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్ల్యాం రామ నామ వరాననే” ఈ శ్లోక పఠిస్తే వేయిసార్లు విష్ణు భగవానుడి నామాలు చెప్పినట్టు అని అంటారు. సహజంగా కష్టకాలంలో మనసులో మరే ఇతర భావన లేకుండా, చటుక్కున శ్రీమహావిష్ణువును తలవడమే తరువాయి, వచ్చి ఆపదనుండి గట్టెక్కిస్తాడు. అలాంటి శ్రీమహావిష్ణువు నామాలు వేయిమార్లు పలికితే వచ్చే పుణ్యఫలం శ్రీరామ నామం మూడు మార్లు పలికితే వచ్చేయడం అంటే… శ్రీరామనామం యొక్క గొప్పతనం మనకు కనబడుతుంది.

మనసులో ఏభావన లేకుండా కష్టకాలంలో పూర్తి మనసును భగవంతుడిపై పెట్టి, భగవంతుడిని తలవడం జరిగితే, శ్రీమహావిష్ణువు ఏవిధంగా వచ్చి రక్షణ చేస్తాడో మనకు గజేంద్రమోక్షం ఘట్టం నిరూపిస్తుంది.

పదే పదే మారుకి ఒకసారి మూడు మార్లు శ్రీరామ నామ జపం చేయడం ద్వారా శ్రీరాముని గురించిన భావనలు మన మనసులో బలపడతాయి. శ్రీరాముని గురించి బలపడిని భావనలు శ్రీరాముని గురించి తెలియజేయబడిన గ్రంధపఠనం వైపు మనసును మళ్ళిస్తాయి. శ్రీరామాయణం మనసు పెట్టి చదివినవారికి శ్రీరాముని గుణగణాలే మనసులో బాగా నాటుకుంటాయి.

శ్రీరాముడు నిలువెత్తు ధర్మస్వరూపంగా చెబుతారు.

శ్రీరామాయణంలో ఒక చోట రావణుడికి శ్రీరాముని గురించి చెబుతూ… ”శ్రీరాముడు నిలువెత్తు ధర్మస్వరూపంగా, నడిచే ధర్మముగా చెబుతారు. అటువంటి శ్రీరామ నామ జపం చేయడం వలన, మన మనసులో ధర్మం గురించిన భావనలు బలపడతాయి.

ధర్మమును రక్షిస్తే, ధర్మము నిన్ను రక్షిస్తుంది. అటువంటి ధర్మమును అడుగడుగునా ఆచరించి చూపిన శ్రీరాముని గురించి జపం చేయడం, తపించడం అంటే ధర్మము గురించి తపించడమే…

ప్రకృతిలో పదార్ధమును పరిశీలించిన ఏవో కొన్ని ధర్మములను కలిగి ఉంటాయి. ఆ పదార్ధము యొక్క ధర్మాలను తెలుసుకోవడం వలన, ఆ పదార్ధమును ఏవిధంగా ఉపయోగించుకోవాలో తెలియవస్తుంది. అలాగే జీవిత పరమార్ధమును చేరుకునే ధర్మమార్గమును ఆచరించినవారి గుణగణాలు తలవడం అంటే, ఆ ధర్మమార్గము మనకు మన జీవితంలో గోచరించే అవకాశం ఉంటుంది.

భగవానుడు అందరినీ ఒకే లాగా అనుగ్రహించడం…. శ్రీరామదాసు, అన్నమయ్య… ఇద్దరూ భగవానుడిని కీర్తించినవారే కానీ ఇద్దరినీ అనుగ్రహించిన తీరు వేరుగా ఉంటుంది. అలాగే అందరి జీవితాలు కూడాను… కాబట్టి మనం ఆ భగవానుడిని పట్టుకుంటే మన జీవితం గురించి సాక్షి అయిన శ్రీరామచంద్రుడే, ఏవిధంగా అనుగ్రహించాలో ఆవిధంగా అనుగ్రహించే అవకాశం ఉంటుంది.

ధర్మమార్గమునకు మన ప్రయత్నం చేయడం మన ప్రధమ కర్తవ్యం. మన జీవితానికి అవసరమైన కర్తవ్యం మనం నిర్వహించుకుంటూనే, మన జీవిత పరమార్ధం గురించి కూడా మన ప్రయత్నం చేయడం మన ధర్మం. అందుకు ముందుగా నామస్మరణ కన్నా మేలైనది లేదు అంటారు.

పోతనమాత్యుడు రచించిన భాగవతం శ్రీరామునికే అంకితం

బమ్మెర పోతరాజు రచించిన భాగవతం, ఎక్కువగా శ్రీమహావిష్ణువు గురించి, శివుడి గురించి ఉంటే, అలాంటి భాగవత రచనకు దైవానుగ్రహం శ్రీరాముని రూపంలో జరిగింది. భాగవతం రచించిన పోతనామాత్యులు పరమ రామభక్తుడు… చివరికి భాగవతం శ్రీరామునికే అంకితం ఇచ్చారు. అంటే శ్రీరాముడు అనుగ్రహిస్తే శ్రీమహావిష్ణువు, పరమశివుడు అనుగ్రహం పొందినట్టే.

హరిహరుల అనుగ్రహం సులభంగా పొందాలంటే, శ్రీరామ నామ జపం మూడు మార్లు పదే పదే తీరిక వేళల్లో చేయడం మేలు అంటారు. మరీ ముఖ్యంగా శ్రీరాముడు కష్టకాలంలో ఓ మాములు మనిషిలాగానే దు:ఖించడం కనబడుతుంది.

మన కష్టకాలంలో తోటివారి మాటలు ఓదార్పు ఎలా ఉంటుందో… శ్రీరామాయణం చదివితే, రాముని మనసు మన మనసుకు మరింత దగ్గరవుతుందని అంటారు. అందుకే శ్రీరామ నామ జపం పదే పదే చేసి, శ్రీరామచంద్రుని గురించి భావనలు బలపడ్డాక, శ్రీరామాయణం చదువుతుంటే, శ్రీరాముడే మనసులో కొలువై ఉంటాడని అంటారు. ముందుగా శ్రీరామ నామ జపం మనస్ఫూర్తిగా, భక్తితో, నమ్మకంతో చేయడం అలవాటు అయితే, శ్రీరాముని అనుగ్రహం కలుగుతుంది.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్

Enable Notifications    Ok No thanks