మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి? ప్రధానంగా ప్రధమ పుత్రుడు కానీ ఏకైక పుత్రుడు కానీ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే విధంగా జీవించాలని పెద్దలు అభిప్రాయపడుతూ ఉంటారు.
పితృవాక్య పరిపాలన ప్రధాన కర్తవ్యంగా జీవించాలని రామాయణం మనకు బోధిస్తుంది… రామాయణం ప్రకారం ఆలోచిస్తే, తండ్రిమాటకు విలువనిచ్చి జీవించడం కుమారుడి ప్రధాన లక్షణంగా కనబడుతుంది.
మంచి కుమారుడు తండ్రిమాట వినాలి అంటారు. ఇంకా సమాజంలో తండ్రికి తలవొంపులు తేకుండా ప్రవర్తించాలి. మంచి విషయాలలో తండ్రిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా పెద్దవారితో వినయంగా మెసులుకోవాలి.
పెద్దలు చెప్పే మాటలలో తండ్రి మంచి ఆశయాలకు అనుగుణంగా కుమారుడు తన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఎక్కువగా సూచిస్తూ ఉంటారు.
ఇంకా మన తెలుగు సాహిత్యంలో ప్రధానమైన శతకాలలో కూడా కుమారుడి గురించిన హితోక్తులు ఉంటాయి. ముఖ్యంగా సుమతీ శతకంలోని ఈ క్రింది పద్యమును చదవండి…
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహమునాడు పొందుర సుమతీ !
కుమారుడు పుట్టిన వెంటనే తండ్రికి ఉత్సాహం కలగదట… తండ్రి నివసిస్తున్న ప్రాంతములోని ప్రజలతోనూ మరియు తన బంధు మిత్రులతోనూ కూడా తన కొడుకు గురించి మాట్లాడుకునే మంచి మాటలే…. తండ్రికి ఉత్సాహం కలిగిస్తాయట… ఈ పద్యమును ఆధారంగా చూస్తే… మంచి కుమారుడు పదిమందితోనూ కీర్తించబడేవానిగా జీవించాలి…
తనయందు గల ధర్మమును రక్షిస్తూ, తన కర్తవ్యం తాను నిర్వర్తిస్తూ ఉండడం చేత, సమాజంలో గుర్తింపు సాధించవచ్చని అంటారు.
ఇంకా తల్లిదండ్రులపై కుమారుడు దయతో ప్రవర్తించాలి. దయలేని కొడుకు గురించి మన మహనీయుడు వేమన కూడా కఠినంగానే విమర్శిస్తారు…. ఈ క్రింది పద్యం చూడండి.
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తండ్రియందు భాసిస్తున్న మంచి సుగుణాలను ఆదర్శంగా తీసుకుంటూ, తనకు తెలిసి పరిజ్ఙానంతో తన చుట్టూ ఉన్నవారితో వినయంతో వ్యవహరించడం వలన మంచివానిగా తండ్రి యొక్క సమాజంలో మంచి గుర్తింపు పొందవచ్చును.
పెద్దవారియందు తప్పులెంచడం కన్నా… పెద్దవారియందు గల మంచి గుణములను గుర్తు పెట్టుకుని… వాటినే మననం చేసుకోవడం మంచి లక్షణంగా చెప్పబడుతుంది.
మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులువిద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?