నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత తెలుగు వ్యాసం. బడికిపోయి చదువుకునే పిల్లలు, పనిని పరిశీలించే పిల్లలు, తండ్రిని అనుసరించే పిల్లలు, చదువుకోని పిల్లలు, వ్యతిరేకించే పిల్లలు… రకరకాల స్వభావాలతో పెరుగుతున్న పిల్లలే రేపటి యువత.
కొందరు బాల బాలికలు సహజంగా చదువుకోవడానికి సుముఖంగా ఉంటే, కొందరు బాల బాలికలు చదువుకోవడం కన్నా ఏదో నేర్చుకునే ప్రయత్నంలో ఆసక్తి ఎక్కువగా కనబరుస్తారు. కొందరు బాల బాలికలు ఖాళీగా తిరగడానికి ఆసక్తి చూపవచ్చు… కానీ తల్లిదండ్రుల ప్రోద్బలంతో విద్య బడికివెళ్ళే బాల బాలికలు ఉంటారు. ఆసక్తి రకరకాలుగా ఉంటుంది… కానీ చదువుకునే దశలో ఎక్కువమంది పాఠశాలకు పరిమితం అవుతూ ఉంటారు. ఎందుకంటే ఏ టాలెంట్ ఉన్నా సరే డిగ్రీ అవసరం… కాబట్టి బాల బాలికలకు బాల్యం నుండి యుక్త వయస్సు వరకు చదువు చాలా చాలా అవసరం.

సమాజం ఏ స్థితిలో ఉన్నది? బడిలో చదువులు ఏ విధంగా సాగుతున్నది? అన్నదానిపై బాల బాలికలలో భావనలు పెరిగే అవకాశం ఉంటుంది. నేర్చుకునే బడిలో చెప్పే పాఠాలు బాల బాలికల మనసులోకి చేరతాయి… అలాగే వారు చూస్తున్న సామాజిక స్థితిగతులు కూడా బాల బాలికల పరిశీలనలోకి వస్తూ ఉంటాయి. పేదరికంలో గడిపే విద్యార్ధి దశలో మరింత సామాజిక పరిస్థితులు వారి దృష్టిలో పడతాయి. ఇలా సమాజం మరియు బడి బాల బాలికలపై ప్రభావం చూపుతూ ఉంటే, అలా పెరిగిన నేటి బాల బాలికలే యువతగా మరలా సమాజంపై ప్రభావం చూపుతారు.
అంటే ఎదుగుతున్న వయసులో నేర్చుకోవడానికి ప్రయత్నించే పిల్లలకు సమాజం ఏవిధమైన తీరుతెన్నులు చూపితే, ఆ రీతిలో నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువతగా మార్పు చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నేటి బాల బాలికలు భావి యువతగా మరడంలో తల్లిదండ్రుల ప్రభావం
వర్తమానంలో ఇంట్లో ప్రవర్తన బాలలపై ప్రభావం చూపుతుంది. ఏదైనా ఇంట్లో బాల బాలికల ముందే తల్లిదండ్రులు వాదులాడుకుంటూ ఉంటే, వారి మనసులో అలజడి భావనలు పెరిగే అవకాశం ఎక్కువ.

తల్లిదండ్రులు వ్యతిరేక భావనలతో చికాకుగా ఉంటూ కీచులాడుకుంటూ… నిత్య వాతావరణం గందరగోళంగా ఇంటిని మార్చుకుంటూ ఉంటే, అదే గందరగోళ ప్రభావం బాల బాలికల మనసులలో నాటుకునే అవకాశం ఉంటుంది.
కుటుంబంలో తల్లిదండ్రులు ఇరువురు ప్రేమతో కలిసి ఉంటూ, బాల బాలికల ముందు హుందాగా ప్రవర్తిస్తూ ఉంటే, అదే హుందాతనం బాల బాలికలలో కూడా ప్రకాశించే అవకాశం ఉంటుంది.
కుటుంబ ఆర్ధిక పరిస్థితి కూడా కొంత పిల్లల పెంపకంలో ప్రభావం చూపవచ్చు. ఏదైనా బాల బాలికల దృష్టిలో ఎటువంటి విషయాలు పడుతూ ఉంటాయో అటువంటి విషయాల పరిశీలన వలన అటువంటి దృక్పధం బాల బాలికలలో పెరిగే అవకాశం ఎక్కువ.

కొందరు పిల్లలు మాత్రం ఏవో తమకు తెలిసినట్టుగా కుటుంబ వాతావరణం ఎలా ఉన్న పువ్వు పుట్టగానే పరిమిళించింది అన్న చందాన సద్భావనతో ఉండవచ్చు… కానీ ఎక్కువమంది తమ చుట్టూ ఉండే పరిస్థితుల ప్రభావానికి లోనవుతూ, తమ మనసులలో సదరు భావాలను పదిల పరచుకునే స్థితి ఎక్కువమంది బాల బాలికలలో ఉంటుందని అంటారు.
నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత మార్గదర్శకంగా మారాలంటే…
ఇప్పుడు ఎదుగుతున్న బాల బలికాలే రేపటి భావి భారత యువతగా మారి మరి కొందరికి మార్గదర్శకంగా నిలబడలంటే, ప్రస్తుతంలో జీవిస్తున్న బాల బాలికల ముందు మంచి విషయాలే వారి చుట్టూ ఉండాలి.
గొప్పవారి జీవిత విశేషాలు వారికి తెలియబడుతూ ఉండాలి.
లక్ష్యం లేని జీవితం నిరర్ధకం అనే భావనను వారిలో కలిగించాలి.
ఒక లక్ష్యం ఉన్న జీవితం ఏ విధంగా ఉంటుందో… తెలియజేస్తూ ఉండాలి.
నిత్యం అందుబాటులో ఉండే స్మార్ట్ ఫోన్ ద్వారా చెడు విషయాలపై ఆసక్తి కనబరచే విధంగా కాకుండా స్మార్ట్ ఫోన్ ద్వారా విద్యా విషయాలు నేర్చుకునే విధంగా బాల బాలికలను మోటివేట్ చేయాలి.

వయసుకు మించిన ఆలోచనలు వస్తున్న బాల బాలికలకు వారి వయస్సు గురించి తెలియజేస్తూ… ఏ వయసుకు ఏ విషయం చూడ ముచ్చటగా ఉంటుందో చెబుతూ, వారి వయసు నేర్చుకునే వయసు కాబట్టి నేర్చుకునే వయసులో ఉండాల్సిన వినయ విధేయతల గురించి బాల బాలికలకు తెలుపుతూ ఉండాలి.
చదువు అంటే ఆసక్తి అంతగా కనబరచని బాల బాలికలకు చదువు యొక్క అవశ్యకతను తెలియజేస్తూ ఉండాలి.
విలువలతో కూడిన జీవితం ఎలా ఉంటుందో.. వారికి తెలియజేస్తూ ఉండాలి.
తమ జీవితానికి లక్ష్యం తామే నిర్ణయించుకునే వరకు వారికి మంచి విషయాలను తెలియజేస్తూ ఉండాలి.
స్వామి వివేకానంద, భగత్ సింగ్, సుభాస్ చంద్ర బోస్, అబ్దుల్ కలామ్ వంటి గొప్పవారి గురించిన పుస్తకాలు బాల బాలికలకు అందుబాటులో ఉంచాలి.
ముఖ్యంగా నేర్చుకునేవారి ముందు పద్దతిగా నడుచుకోవడం పెద్ద వయస్సుగల వారు చేయాల్సిన ప్రాధమికమైన పని.
ఎటువంటి విషయాలు బాల బాలికల చుట్టూ పరిబ్రమిస్తూ ఉంటాయో, అటువంటి విషయాలలోనే బాల బాలికలు నిష్ణాతులుగా మారే అవకాశం ఉంటే, ఎటువంటి విషయాలు వారి చుట్టూ పరిబ్రమించేలా చేస్తున్నామో పెద్దలు పరిశీలించుకోవాలి….
నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువతగా మారతారు. కాలంలో జరిగే ఈ ప్రక్రియలో పెద్దల పెంపకం, బడిలో విద్యావిషయాలు, వారి వారి స్నేహితుల ప్రభావం బాల బాలికలపై ప్రభావం చూపుతాయి.
బాల బాలికల అందరి తల్లిదండ్రులు మంచి విషయాలే పిల్లల ముందు ప్రస్తావిస్తూ ఉంటే, పిల్లల్లో చెడు సావాసం చేసే అవకాశం చాలా తక్కువ కదా… సమాజం ద్వారా ఏ ఒక్కరో ప్రభావితం అయితే, కుటుంబ సభ్యుల వలన ఎక్కువమంది బాల బాలికలు ప్రభావితం చెందే అవకాశం ఉంటే, కుటుంబ వాతావరణం సరైన పద్దతిలో సాగితే, ఎక్కువమంది విద్యార్ధుల మనసు శాంతిగా ఉంటే, భావి భారత సమాజంలోకి మంచి యువత చేరుతుంది… కదా!
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలువిద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?