By | November 7, 2021

కాలము కలము ఒకే అక్షర రూపంగా కనిపించే వీటిని ఉపయోగించుకుంటే జీవితమే అద్భుతము అంటారు. ఒక దీర్ఘము తేడా రెండు పదాలలోనూ అక్షరాలు ఒక్కటే, వాటిని ఉపయోగించకుంటే ఉన్నత స్థితికి చేరవచ్చును అంటారు. కలంతో చైతన్యవంతమైన విషయమును పంచుకోగలం… కాలం ఉపయోగించుకుంటే, అంతకన్నా బంగారం ఉండదు.

కలం ఉపయోగిస్తూ కాలంలో కరిగిపోనీ కీర్తిని గడించవచ్చును… అందుకు తగిన సాధన అవసరం అంటారు.

కలము అంటే పెన్ను. కత్తి కంటే కలము గొప్పది అనే నానుడి ప్రసిద్ది. అంటే మారణాయుధం కన్న కలము గొప్పది. కత్తి ఇతరులలో భయాన్ని సృష్టించగలదు. ఆందోళన రేకిత్తంచగలదు. కానీ కలము ఇతరులలో ఆలోచన కలిగించగలదు. సమాజంలో మార్పుకు నాంది కాగలదు. విషయమును వివరించడంలో కలము కన్నా గొప్ప ఆయుధము ఏముంటుంది. మనిషి మాటకుండే శక్తి అక్షరరూపంలో మార్చాలంటే ఉపయోగపడేది కలమే…

నేర్చుకున్న పాఠ్యాంశముల సారమును ప్రశ్నాపత్రములలో వ్రాయడానికి కలమే ఉపయోగపడుతుంది. కలము లేకుండా కాగితముపై ఏమి చేయలేము. కాబట్టి కలమును సద్వినియోగం చేసుకోవడంలోనే విద్యార్ధి దశలో రెండింటిని సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. కలం బాగా ఉపయోగిస్తున్నాము అంటే నేర్చుకున్న అంశములో సాధన బాగా చేసినట్టే అయితే, ఆ సాధన చేయడంలోనే కాలం కూడా సద్వినియోగం అవుతుంది. అంటే కలమునకు కాలమునకు ఒక దీర్ఘమే తేడా ఫలితం మాత్రం రెండు కలిస్తేనే సరైన సమయంలో కలమును కరెక్టుగా ఉపయోగిస్తే, భవిష్యత్తు కాలంలో మరింత ప్రయోజనం పొందగలం.

యువతలో కాలహరణం చేసే అవకాశం

యువతగా మారుతున్న వారిలో ముందుగా కాలక్షేపం కోసమని ప్రారంభించే సంభాషణల మద్య కాలహరణం చేసే విషయాలు వచ్చి చేరుతూ ఉంటాయి. వాటి వలన కాలం హరించుకుపోతుంది. నేర్చుకునే వయసులో నేర్చుకోవాలసిన విషయాలు మరుగునపడతాయి. యువత విషయంలో ఎక్కువగా జరిగే కాలహరణము నివారించుకోగలిగితే, ఆ యువత తమ జీవితాన్ని అద్భుతంగా మరల్చుకోగలరని అంటారు.

ఎప్పుడూ చదువేనా కాసేపు అటవిడుపు ఉండాలి అంటూ విశ్రాంతిగా ప్రారంభం అయ్యే ఆటలు కానీ కాలక్షేప కబుర్లు కానీ నిర్ణీత సమయంలో ముగించకపోవడం వలన జరిగే కాలహరణం వలన తగిన మూల్యం చెల్లించవలసినది అలా కాలహరణం చేసినవారే.

ఒకేలాగా కాలమే ఉండదు అలాంటప్పుడు మనిషి మనసు ఎలా ఉంటుంది? అయితే అటువంటి సమాజంలోనే అటువంటి కాలంలోనే గొప్పతనం పొందిన నాయకులు కానీ, స్పూర్తినిచ్చే మహానుభావులు కానీ పుస్తకాలలోకి ఎక్కిన జీవిత చరిత్రలు కానీ పరిశీలిస్తే, వారు తమ జీవితంలో కాలాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నారనే పాఠం తెలియబడుతుంది.

మనిషి జీవితపు కాలము పరిమిత కాలము అది ఎంతకాలము అనేది ఎవరికీ తెలియనిది. కానీ ఏమి సాధించాలనే లక్ష్యము మాత్రము ఎవరికివారే నిర్ధేశించుకోవలసి ఉంటుందని పెద్దలంటారు. అలా నిర్ధేశించుకున్న మంచి లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన కృషి చేయడానికి కాలమును సరిగ్గా ఉపయోగించుకోవడంలోనే జీవితపు లక్ష్యం నెరవేరగలదు.

ఇలా కాలము కలము ఒకే అక్షర రూపంగా కనిపించే వీటిని ఉపయోగించుకుంటే మాత్రం జీవితంలో ఉత్తమ లక్ష్యాలను సాధించవచ్చని అభిప్రాయపడుతూ ఉంటారు.