By | October 30, 2021

మనసుకు అలవాటుగా మారుతున్న అంశాన్ని అడ్డుపెట్టుకుని, మనసుపై పట్టు సాధించడం వలన స్వీయ నియంత్రణ పెరుగుతుందని అంటారు. మనిషికి మనసే బలం మనసే బలహీనత అంటారు.

విద్యార్ధి దశలో చిన్న చిన్న పొరపాట్లే అలవాట్లుగా మారకుండా జాగ్రత్తపడాలి. నేర్చుకుంటూ ఏవో కొన్ని విషయాలను అలవాటుగా మార్చుకునే గుణం మనసుకు విద్యార్ధి దశలో ఉంటే, మంచి విషయాలలో ఆసక్తి అలవాటుగా మారితే, అవి జీవితానికి ఉపయోగపడతాయని అంటారు.

రోజూ ఆడుకోవడం ఇష్టం కాబట్టి ప్రతిరోజూ ఆట ఆడుకునే సమయానికి మనసు ఆడుకోవడానికి దృష్టి సారిస్తుంది. ఎప్పుడూ ఫ్రెండ్స్ ఆడుకుందామని అంటారో అనే భావనను మనసు రోజూ ఆడుకునే వేళకు పొందుతూ ఉంటుంది. ఇలాంటి భావనలు పుట్టే సమయంలో మనసును ఎలా నియంత్రించుకుంటే మేలు కలుగుతుందో? పెద్దలు చెబుతూ ఉంటారు.

ప్రతిరోజూ ఒక సమయానికి ఆడుకోవడం అలవాటు అయితే, అదే సమయానికి చదువు విషయంలో రోజువారీ డైరీ ప్రకారం ఉండే పెండింగ్స్ క్లియర్ చేసుకునే విధంగా మనసుకు అలవాటు చేయడం వలన చదువులో వెనుకబడే అవకాశం తక్కువ. ఇంకా ఆటలు ఆడి అలసిపోయాక చదువులో పెండింగ్స్ విషయం బాధించదు. లేకపోతే ఆటలు అలసిపోయాక చదువులో పెండింగ్స్ గుర్తుకు వచ్చి మనసు నిరుత్సాహం పొందే అవకాశం కూడా ఉంటుంది.

అలాగే పిల్లలకు కూడా టివి చూడడం టివిలో సీరియల్స్ కు అలవాటు అవ్వడం జరిగిపోతుంది. ఇంట్లో టివి పెద్దలు చూస్తూ ఉంటే వారితోపాటు వీరు టివి చూస్తూ సీరియల్స్ లేక ప్రాయోజిత కార్యక్రమముల వీక్షణకు అలవాటు అవ్వడం సహజంగా చేసే పొరపాటు అయితే అది అలవాటుగా మారి చదువుకు ఇబ్బంది కలుగజేస్తుంది. అదే టివి సీరియల్ చూసే ముందు చదువులో పెండింగ్స్ పూర్తి చేయాలనే కండిషన్ మీకు మీరుగా పెట్టుకుంటే, చదువులో విజయవంతంగా ముందుకు సాగవచ్చును అంటారు.

ఇలా ఏదైనా చిన్న చిన్నగా అలవాటు అవుతున్నప్పుడే ఆ అలవాటును ఆసరాగా తీసుకుని చదువులో ఉపయోగపడే అంశాన్ని సాధించడానికి ప్రయత్నిస్తే, చదువు సాగుతుంది. మనసుకు కూడా వినోదాత్మకంగానే ఉంటుంది. మనసు ఇష్టపడితే కష్టం కూడా ఇష్టంగా అనిపిస్తుందంటారు. మనసుకు కష్టంగా అనిపిస్తే, సులభమైన పనికూడా భారమవుతుందని అంటారు.

అలవాటును ఆసరాగా మనసుతో మనసుపై పట్టు ఉండడమే స్వీయ నియంత్రణ అయితే చదువుకునే వయస్సులోనే అలవాట్లకు సంభందించిన అంశాలలో పరిశీలన అవసరం.

పిల్లలలో ఇలాంటి అలవాట్లను పెద్దలు గుర్తించి హెచ్చరిస్తూ ఉంటారు. టీచర్లు పరాకు చెబుతూ ఉంటారు. అప్పుడు ఒక్కసారి మన మనసును మనం పరిశీలిస్తే, విద్యార్ధి దశ నుండే స్వీయనియంత్రణ కలిగి ఉండడం జరుగుతుందని అంటారు.