By | January 11, 2022

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి! శాంతిగా ఉండే మనసు బాగా ఆలోచన చేయగలిగితే, అశాంతితో ఉండే మనసు అసహనంతో ఉంటుంది. పరిష్కార ధోరణి కానరాదు.

శాంతియుత వాతావరణంలో వ్యక్తి జీవనం ప్రశాంతంగా ఉంటుంది. శాంతస్వభావం ఉన్నవారి మాటతీరు ఆహ్లాదకరంగా ఉంటుంది. శాంతము లేని చోట సౌఖ్యముండదని అంటారు. దైనందిన జీవితంలో సమస్యల వలయం ఏర్పడుతూనే ఉంటే, అశాంతితో ఉన్నవారు ఆ వలయంలో చిక్కుకుంటారు. శాంత చిత్తంలో ఆలోచించేవారు సమస్యలకు పరిష్కార ధోరణితో ముందుకు సాగగలరు.

మనిషి శాంతిగా ఉండడం చేత, తన చుట్టూ ఉండేవారి మనసులో కూడా శాంతిని పెంపొందించగలడు. అందుచేత వ్యక్తి జీవితంలో శాంతి ఆవశ్యకత ఉంది. ఆగ్రహం అవసరం మేరకు ఉండాలి. ఆప్తులపై అనుగ్రహం ఉండాలి. కానీ ఎప్పుడూ ఆగ్రహావేశాలతో మనిషి మమేకం కాకూడదు.

ఆగ్రహావేశాలతో మనిషి మమేకం కావడం చేత తన మనసులో శాంతిని కోల్పోయే అవకాశం ఉంటుంది. స్వస్థత పొందడంలో శాంతియుత స్వభావం చాలా ముఖ్యమంటారు.

ఒక కుటుంబం అయినా, ఒక సంస్థ అయినా సమస్యను ఎదుర్కొనవలసిన ఆగత్యం ఏర్పడుతుంది. ఆ సమయంలో శాంతియుత వాతావరణమే సమస్యకు పరిష్కారం చూపగలదు… కానీ ఆగ్రహావేశాలకు గురయ్యే స్వభావం వలన సమస్య మరింత జఠిలం కాగలదు. కావునా కుటుంబ వృద్దికి కానీ, సంస్థ వృద్దికి కానీ శాంతి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది.

సమాజంలో శాంతి గురించి హితోక్తులు చాలా ఉంటాయి.

మహాభారత యుద్ధం దుర్యోధనుడి అసూయ ధ్వేషము కారణం. కానీ దుర్యోధనుడుకి శాంత స్వభావం లేకపోవడం వలన రాజ్యాధికారం దక్కినా ప్రశాంతంగా జీవించలేకపోయాడు. ప్రతికారేచ్చతో పాండవుల పతనానికి ప్రయత్నించి, తన పతనాన్ని కొనితెచ్చుకున్నాడు.

ధర్మరాజు శాంత స్వభావం వలన, ధీరులైన సోదరులను నియంత్రించగలిగాడు. అతని సంరక్షణకు పరమాత్మ సైతం ప్రయత్నించాడు. యుద్ధం దగ్గరపడుతున్న సమయంలో కూడా ధర్మరాజు ఇరుపక్షాల ప్రయోజనార్ధం శాంతియుత చర్చలకు ప్రయత్నించాడు. సఫలం కాకపోయినా, సమాజంలో కీర్తిని గడించాడు.

అంటే శాంతిగా ఉండడం చేత వ్యక్తి దీర్ఘకాలిక కీర్తిని గడించవచ్చనే అభిప్రాయం ప్రకటితం అవుతుంది.

స్వాతంత్ర సమరంలోనూ శాంతియుత ఉద్యమాలు నడిచాయి.

దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో వీరులు తమ ప్రాణాలు కోల్పోయారు. స్వాతంత్ర్య కాంక్షను దేశవ్యాప్తంగా రగల్చడంలో స్వాతంత్ర్య పోరాట యోధులు విజయవంతం అయ్యారు. అయితే శాంతియుత ఉద్యమాలు చేయడంలో మహాత్మగాంధీ ముందుండి నాయకత్వం వహించారని అంటారు.

చివరకు మన దేశ స్వాతంత్ర్యం కూడా శాంతియుత మార్గంలోనే లభించిందని చెబుతారు.

దీనిని బట్టి శాంతియుతంగా చేసే ప్రయత్నం దీర్ఘకాలిక ప్రయత్నంగా కనిపించినా, అది విజయవంతం అయిన రోజు చారిత్రికరోజుగా మిగిలిపోతుంది.

సమాజంలో శాంతి ఆవశ్యకత చాలా ఉంటుంది.

కారణం సమాజంలో వ్యక్తులతో కూడిన కుటుంబాలు, ఉద్యోగులతో కూడిన సంస్థలు, నిర్ధేశిత విధానలతో నడిచే వ్యవస్థలు… అనేక రంగాలలో అనేక వ్యవస్థలు కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. అయితే వాటిలో పనిచేసి, ఆయా రంగాలలో వృద్దికి కృషి చేసేది… వ్యక్తులే… అటువంటి వ్యక్తులు శాంతిగా ఉంటేనే, సమాజిక పరిస్థితులు బాగుంటాయి. వ్యవస్థలు, సంస్థలు వృద్దిలోకి వస్తాయి.

ఒకరు అశాంతితో ఉంటే, మరొకరిపై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంటే, మరొకరి అశాంతి ఇంకొకరి అశాంతికి కారణం కాగలదు… ఎందుకంటే మనిషి మనసు భావాలకు ప్రతిస్పందిస్తూ ఉంటుంది… కాబట్టి సమాజంలో శాంతి ఆవశ్యకత చాలా అవసరం. సమాజంలో శాంతికి వ్యక్తులు, వ్యవస్థలు కృషి చేయాలి…. శాంతి వలననే అభద్రతా భావం తొలగుతుంది.