By | July 10, 2024

సాహిత్య విమర్శకుడుగా గురజాడ
‘కన్యాశుల్కం’ నాటకం ఇవాల్టికీ గురజాడ కళా సృష్టికి దర్పణంగా నిలుస్తోంది. ‘ముత్యాల సరాలు’ ఛందస్సులో ఆయన తెచ్చిన గొప్ప మార్పుకి ప్రతీకగా నిలుస్తోంది. ‘తెలుగు కవిత్వంలో నేను కొత్త, ఎక్స్పెరిమెంట్‌ ఆరంభించాను. నా ముత్యాల సరాల రీతిని మీరు గమనించినట్లయితే మీకే ఈ విషయం ధృవపడుతుంది… నా మొదటి గేయంలో సాధ్యమైనన్ని వాడుక మాటలను, గ్రాంధిక వ్యాకరణ సూత్రాలకు, లేదా ప్రాచీన కవుల పద్ధతులకు ఒదగని శబ్దాలను ప్రయోగించాను’ అని ఆయన ఒక లేఖలో రాశారు. నాటక ప్రక్రియలో, కవితా వ్యాసంగంలో, వ్యవహారిక భాషకు పునాది వేసిన గురజాడ విమర్శన మార్గాన్ని కూడా అనుసరించాడు. ప్రత్యేకించి విమర్శనాత్మక రచనలు చేయలేదు. కాని లేఖల్లో, ‘అసమ్మతి పత్రం’లో ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ఆయన హేతువాద విమర్శనా దృష్టికి ఉదాహరణగా నిలుస్తాయి. నాటకంలో, కవిత్వంలో ఆయన కళాత్మక నైపుణ్యం కనిపించినట్టే, విమర్శకి సంబంధించిన ఆయన శాస్ర్తీయ ఆధునిక దృష్టిని ఆ అభిప్రాయాలు తెలియచేస్తాయి.