By | July 10, 2024

శ్రీ శ్రీ మన మహనీయుడు

ఆధునికతకు విరాట్‌రూపం శ్రీశ్రీ. ఇంటిపేరు, ఒంటి పేరుల్ని క్లుప్తీకరించి అణువుల్లా పేర్చుకోవటంతో పేట్రేగిన ఆధునికత ఆపై కవిత్వమై పేలింది.
‘తెలుగు సాహిత్యం’పై శ్రీశ్రీదే అసలైన ‘ముద్ర’. తెలుగు కలాల్లో జడపదార్థాలూ, చైతన్య పదార్థాలూ సమంగానే ఉన్నాయి. శ్రీశ్రీ ఒక్కముక్కలో చోదకశక్తి. మరో ప్రపంచం కోసం పలవరించి తానే మరో ప్రపంచమై వెలుగు రేకలు విప్పారిన ఏకైక కవి. అక్షరంలోని అనంతశక్తిని లోకానికి చాటిన ప్రజాకవి శ్రీశ్రీ. ప్రాచీన కవులూ, ప్రబంధ కవులూ శబ్ద వైచిత్రికీ, కల్పనా చాతుర్యానికీ పెట్టింది పేరు. మళ్లీ ఆ రెంటినీ ఆధునిక కవుల్లో ఒక్క శ్రీశ్రీలోనే చూస్తాం. ప్రబంధ కవుల తరవాత అంతటి శబ్ద మహేంద్రజాలం శ్రీశ్రీలోనే వెల్లువెత్తుతుంది. పద్యాన్ని తప్పిస్తే తెలుగు కవిత్వం లేనేలేదనిపించేంతలో- నేటికాలంలో ‘మహాప్రస్థానం’ మేరువై, జనాభ్యుదయానికి చేరువై ఆధునిక సాహిత్యాన్ని బతికిస్తూంటుంది.