శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా

పాత పౌరాణిక సినిమాలలో ఆంజనేయుని గురించి అంటే చాలా ఆసక్తి ఉంటుంది. ఆంజనేయుడు అంటే అందరికీ ఇష్టేమే. అలాంటి శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా గురించి తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం. శ్రీ ఆంజనేయచరిత్ర సినిమాను చూడడానికి ఇక్కడ తాకండి

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

నిత్యం రామనామజపంతో చిరంజీవిగా ఉండే శ్రీఆంజనేయస్వామి అనేకమంది భక్తులను కలిగిన పరమ శ్రీరామభక్తుడు. రామసంకీర్తనం చేస్తూ, శ్రీరామచంద్రుడిని హృదయంలో పదిలపర్చుకున్న భక్తాగ్రేసుడు, హనుమ, ఆంజనేయస్వామి, మారుతి, అంజనీపుత్రుడు, రామదూత అంటూ అనేక నామాలతో నిత్యం భక్తుల మనసులో మెదులుతూనే ఉంటాడు.

శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా భక్తి చిత్రాలలో ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకోవడంలో బాగుంటుంది. ఆంజనేయుడు అన్నా వినాయకుడు అన్నా పిల్లలకు మహాఇష్టంగా ఉంటే, వారికి కూడా పిల్లలంటే మహాప్రీతి. అలాంటి ఆంజనేయుని పుట్టుక, విద్యాభ్యాసం, హనుమ విజయాలు గురించి శ్రీ ఆంజనేయ చరిత్ర సినిమాలో చక్కగా చూపించారు.

ధర్మరాజు సోదరుడు భీమసేనుడికి ఒక ముసలికోతి తోకతో గర్వభంగం

శ్రీ ఆంజనేయచరిత్ర తెలుగు సినిమా ప్రారంభం శ్రీరామసంకీర్తనం చేస్తున్న హనుమతో ప్రారంభం అవుతుంది. హనుమా రామగానం చేస్తూంటే, భీమసేనుడు అటువైపుగా వచ్చే సన్నివేశాలు పాట మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. పాట పూర్తయ్యేసరికి, భీమసేనుడి రాకను గమనించిన, అంజనీపుత్రుడు ఒక ముసలికోతి వేషం వేసుకుని, తనతోకను దారికి అడ్డుగా పెట్టి, ఒకరాయికి ఆనుకుని లేవలేని స్థితిని తలపిస్తూ కూర్చుని ఉంటాడు. అటుగా వెళ్తూ అక్కడికి చేరిన భీమసేనుడు దారిలో కనిపించిన తోకను గమనించి, ఆతోక ఎక్కడి నుండి వచ్చిందో గమనించి, ఆవైపు చూస్తాడు. తోకను అడ్డుతీయమని భీముడు ఆంజనేయస్వామితో వాదిస్తాడు.

ఆంజనేయుడు భీమసేనుడితో…”నీవే తోకను నీవే తీసి, నీదారిన నీవు వెళ్లు” అంటాడు. భీముడి శతవిధాలా ప్రయత్నించినా…ఆంజనేయుని తోకను ఒక్క ఇంచుకూడా కదపలేకపోతాడు. అప్పుడు భీమసేనుడు ఇది సామాన్య కోతికాదు అని గ్రహించి, ఆ ముసలికోతితో తన అహంకారానికి క్షమాపణ అడుగుతాడు. అప్పుడు ఆంజనేయస్వామి తన నిజస్వరూపంతో ప్రత్యక్షమవుతాడు. ఇద్దరు సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, పరామర్శించుకుంటారు. తరువాత భీమసేనుడు అభ్యర్ధన మేరకు తన జీవితచరిత్రను, చెప్పడం ప్రారంభిస్తాడు, ఆంజనేయస్వామి.

భీమసేనుడితో హనుమ తనకధను తానే చెప్పడం

అంజనీదేవి సంతానాపేక్షతో పరమశివుని కొరకు తపము చేస్తూ ఉంటుంది. ఆ తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఆదేశానుసారం, వాయుదేవుడు ఒక పురుషస్వరూపంలో ఆంజనీదేవికి సాక్షాత్కారిస్తాడు. అప్పుడు వాయుదేవుడు నీకు సంతానం అనుగ్రహించడానికే, నేను వచ్చాను అని చెప్పి, ఒక దివ్యమైన ఫలమును అంజనీదేవికి వాయదేవుడు అనుగ్రహిస్తాడు. శివానుగ్రహం వలన, అంజనీదేవికి పుత్రుడు జన్మిస్తాడు. బాలుడైన హనుమ దిన దిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ, చెట్లు ఎక్కుతూ అల్లరి చేస్తూ ఉంటాడు. అలా ఒక్కసారి ఆకాశంలో సూర్యబింబం చూసి, అదేదో ఒక పండు అనుకుని, అందుకోవడానికి వాయువేగంతో ఆకాశంలోకి వెళతాడు, బాలహనుమ. సూర్యబింబాన్ని అందుకోబోతున్న బాలహనుమపై, దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు.

దానితో బాలహనుమ ఆకాశం నుండి క్రిందపడిపోతూ ఉంటే, అతని తండ్రి వాయుదేవుడు, ఆ బాలుడిని పట్టుకుని, ఇంద్రుడుపై ఆగ్రహించి, తన సహజస్వభావాని లోకాల నుండి నిష్క్రమింపజేస్తాడు. దాంతో లోకాల్లో వాయుస్థంభన జరిగి, ప్రపంచం స్థంబింపజేయడంతో ఇంద్రుడు, త్రిమూర్తులు, వాయుదేవుని దగ్గరకు వచ్చి, హనుమకు అనేకవరాలు ఇచ్చి వెళతారు. చిరంజీవిగా, అత్యంత బలవంతునిగా, శస్త్రాస్త్రములతో బంధింపబడనివానిగా వరములు ప్రసాదిస్తారు. ఇంతటి శక్తిసంపన్నుడైన బాలహనుమకు ఆగడాలు, అల్లరి ఇంకా ఎక్కువ అవుతుంది.

ఆంజనేయుని అల్లరికి ఋషులు కూడా గురికావడంతో, ”నీ శక్తిని నీవు మరిచిపోవుదవని…” ఒక ఋషి హనుమకు శాపానుగ్రహం ఇస్తారు. అక్కడకు పరుగున వచ్చిన అంజనీదేవి ప్రార్ధనమేరకు ”ఎవరైనా ఆంజనేయునికి, తన శక్తి ఏమిటో గుర్తు చేస్తే, తిరిగి అతను అత్యంత శక్తివంతుడై, అఖండ విజయాలను ” సాధిస్తాడని చెబుతాడు. ఇంకా వేదాధ్యయనం కొరకు సూర్యభగవానుని దగ్గరకు ఆంజనేయుని, పంపమని ఋషులు చెబుతారు. సూర్యభగవానుని వద్ద విద్యనభ్యసించిన ఆంజనేయస్వామి, సూర్యాదేశం ప్రకారం, కిష్కిందలోని సుగ్రీవుని వద్దకు చేరతాడు.

సుగ్రీవుని రాజ్యం నుండి తరిమేసిన వాలీ

మాయారాక్షసుని చేతిలో వాలి యుద్ధం చేస్తూ మరణించాడని భావించిన సుగ్రీవుడు, పెద్దల సలహాతో సింహాసనం అధిష్ఠించి, మారుతిని మహామంత్రిగా నియమించుకుంటాడు. అయితే సుగ్రీవుడు ఒకరోజు సభలో కొలువుతీరి ఉండగా, వాలి సభాప్రవేశం చేసి, సుగ్రీవుని అక్కడి నుండి వెళ్లగొడతాడు. అన్నదమ్ముల మద్య గొడవకు కలుగజేసుకోవడం, ధర్మంకాదని అనుకుని, హనుమ సుగ్రీవుని అనుసరిస్తాడు. వారివురూ ఋష్యమూకం పర్వతంపైకి చేరతారు.

సుగ్రీవుని-శ్రీరామునికి మైత్రి

సీతావియోగంతో…సీతాన్వేషణ చేసుకుంటూ రామలక్ష్మణులు అటుగా రావడం, సుగ్రీవుడు గమనిస్తాడు. నారబట్టలు కట్టుకుని వస్తున్న వారిని చూసిన సగ్రీవుడు వారెవరో కనుగొని, మిత్రులైతే తీసుకురమ్మని చెప్పి హనుమను వారి దగ్గరకు పంపుతాడు. వారెవరో తెలుసుకోవడానికి మారుతి మారువేషంలో వారి వద్దకు వెళతాడు. ఒక బ్రాహ్మణ వేషంలో తనముందుకు వచ్చిన హనుమను చూసిన శ్రీరాముడు ఆంజనేయా అని సంబోదిస్తాడు. వెంటనే రామలక్ష్మణులను ఋష్యమూక పర్వతంపైన సుగ్రీవుని దగ్గరకు తీసుకువెళతాడు. అక్కడ శ్రీరామునికి, సుగ్రీవునికి స్నేహం కుదురుతుంది.

తర్వాత సుగ్రీవుడు వాలిని రెచ్చగొట్టి, వాలితో తలపడతాడు. ఇద్దరూ ఒకేలాగ ఉండడంతో శ్రీరాముడు బాణ ప్రయోగం చేయడం సాద్యపడదు. దానితో వాలీ చేతిలో చావు దెబ్బలు తిని చివరికి పారిపోయి సుగ్రీవుడు బయటపడతాడు. అయితే ఈ సారి సుగ్రీవుడు ఒకమాలను ధరించి, మరలా వాలీని యుద్ధానికి పిలుస్తాడు. యుద్ధానికి మరలా బయలుదేరుతున్న వాలీని, తార వారిస్తుంది. కానీ తారమాటను పట్టించుకోకుండా వాలీ సుగ్రీవునితో యుద్ద చేస్తాడు.

అప్పుడు శ్రీరాముడు తన బాణంప్రయోగం చేస్తాడు. వాలీ మరణం తర్వాత సుగ్రీవుడు కిష్కిందకు పట్టాభిషక్తుడవుతాడు. వానాకాలం కాగానే సీతాన్వేషణ చేద్దామని, సుగ్రీవుడు లక్ష్మణునితో చెబుతాడు. శీతాకాలం ప్రారంభంగానే సుగ్రీవుడు వానరసైన్యాన్ని వివిధ నాయకత్వంలో వానరులను ఒక మాసం గడువు విధించి నలుదిశలా పంపుతాడు. దక్షిణదిశకు అంగదుని నాయకత్వంలో హనుమతో కూడిన వానరులు బయలదేరతారు. అలా వెళుతున్నవారికి ఎంతకూ సీత కనబడదు. ఇంకా వారికి సముద్రం కనబడుతుంది. సముద్రం దాటి సీతాన్వేషణ చేసేవారెవరు అని వానరులు అంతా వారిలోవారు చర్చించుకుంటూ ఉంటారు.

ఆంజనేయుడు సముద్రం దాటుట

అప్పుడు జాంబవంతుడు, అంగదుడు అంతా ఆంజనేయస్వామిని పొగడ్తలతో, అమితమైన శక్తివంతునిగా కీర్తించి, హనుమశక్తిని, హనుమకు గుర్తు చేస్తారు. ఋషిశాపం వలన మరిచిన తన శక్తి ఏమిటో తిరిగి తెలుసుకున్న ఆంజనేయస్వామి, నూరు యోజనాల సముద్రమును దాటడానికి సిద్దపడతాడు. తోటివారి ఆశీష్సుల అందుకున్న ఆంజనేయుడు అపరిమిత శక్తివంతుడుగా మారి, విడిచిపెట్టిన రామబాణంలాగా సముద్రం దాటి లంకవద్దకు ప్రవేశిస్తాడు. అక్కడ లంకిణిని ఒక దెబ్బతో శాపవిమోచనం కలుగజేస్తాడు. అక్కడి నుండి ఎడమపాదం లంకలో పెట్టి, లంకాప్రవేశం చేస్తాడు.

సీతమ్మని కలసిన హనుమ

అశోకవనంలో సీతాదేవి కూర్చుని ఉన్న చెట్టు వద్దకు, రావణుడు వచ్చి, సీతదేవితో పరుష మాటలు మాట్లాడతాడు. రావణుడు రెండు మాసాలు గడువు విదించి, అక్కడి నుండి నిష్క్రమిస్తాడు. రావణుడి మాటలకు గాయపడిన మనసుతో విలపిస్తున్న సీతమ్మకు రామగానం చేయడం ప్రారంభిస్తాడు, అప్పటికే ఆ చెట్టుపై చేరిన హనుమ. తర్వాత హనుమ, సీతమ్మ తల్లి ముందుకు వస్తాడు. ఆంజనేయునిపై సందేహం వెలిబుచ్చిన సీతమ్మతల్లికి, శ్రీరాముని గుర్తులు తెలియజేస్తాడు. దానితో సీతమ్మతల్లి హనుమపై నమ్మకం ఏర్పడి, శ్రీరాముని క్షేమం అడుగుతుంది. అప్పుడు హనుమ సీతావియోగంతో శ్రీరాముని శోకమును గురించి వివరిస్తూనే, శ్రీరాముడు చేసిన పనుల గురించి చెప్పి, సీతమ్మకు ధైర్యం చెబుతాడు. తర్వాత హనుమ సీతమ్మ దగ్గర ఆనవాలుగా చూడామణిని స్వీకరించి, అక్కడి వనమును అంతా కకావికలం చేయనారంభిస్తాడు. అనేకమంది రాక్షసులను ముప్పుతిప్పలు పెడతాడు. విషయం తెలుసుకున్న రావణుడు కుమారుడు, ఆంజనేయునితో యుద్ధ చేసి మరణిస్తాడు. తర్వాత రావణుడి మరో కుమారుడు మేఘనాధుడు, వచ్చి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడు. బ్రహ్మగారిపై గౌరవంతో, ఆ అస్త్రమునకు పట్టుబడతాడు.

శ్రీరామలక్ష్మణులు వానరసైన్యంతో సముద్రం దాటి లంకకు చేరుట

బ్రహ్మాస్త్రమునకు పట్టుబడిన హనుమ లంకాధినేతతో హితవు చెబుతాడు. సీతమ్మని వదిలి శ్రీరాముని శరణువేడుకోమని, లేకపోతే నీతోబాటు లంకానాశనం తప్పదని చెబుతాడు. కానీ రావణుడు ఆంజనేయుడిని ఒక కోతిగా భావించి, హనుమతోకకు నిప్పంటిస్తారు. వెంటనే హనుమ అదే నిప్పతో లంకాపట్టణాన్ని కాలుస్తాడు. తర్వాత శ్రీరామచంద్రుడి వద్దకు వచ్చి, సీతమ్మ జాడను రామచంద్రునికి తెలియజేస్తాడు. సీతమ్మ ఇచ్చిన చూడామణిని శ్రీరామునికి అందిజేస్తాడు, ఆంజనేయుడు. వానసైన్యంతో రామలక్ష్మణులు సముద్రం దగ్గరకు చేరతారు. అక్కడికి రావణుడి తమ్ముడు అయిన విభీషణుడు వచ్చి, శ్రీరాముని శరణు వేడుకుని, రాముని పక్షంలో చేరతాడు. అటు తర్వాత సముద్రంపై వానర సాయంతో నీలుడు ఆధ్వర్యంలో వారధిని నిర్మించి, శ్రీరామసేన అంతా సముద్రం దాటి లంకకు చేరతారు. రావణుడి సేనతో జరిగిన బీకర యుద్దంలో లక్ష్మణుడు మూర్ఛబోతే, వెంటనే హనుమంతుడు సంజీవిని పర్వతమునే ఆ యుద్ధభూమికి తీసుకువస్తాడు. ఆంజనేయుడు తెచ్చిన సంజీవిని సాయంతో లక్ష్మణుడు బతుకుతాడు. తరువాయి శ్రీరాముని చేతిలో రావణహతం జరగుతుంది.

అయోద్య సభలో ఆంజనేయ హృదయంలో శ్రీరామదర్శనం శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా

రావణ మరణం తర్వాత సీతసమేతంగా రామలక్ష్మణ, ఆంజనేయాదులు అయోద్యకు చేరతారు. అయోద్యలో శ్రీరామపట్టాభిషేకం అంగరంగవైభవంగా జరుగుతుంది. తర్వాత ఆంజనేయునికి సీతమ్మతల్లి ఒక హారమును కానుకగా ఇస్తుంది. అయితే ఆ హారములోని ముత్యములలో శ్రీరాముని రూపం వెతుకుతూ..ముత్యములను కొరికి పారేస్తాడు. అందరూ ఆక్షేపించగా రాముని రూపం ఏ ముత్యము రామభక్తునికి అక్కరలేదని అంటాడు. అప్పుడు అందరూ రామ రూపం అంతటా ఉంటే, నీ హృదయంలో చూపించు అని అంటారు. అందుకు సమాధానంగా హనుమ తన హృదయమును చీల్చి శ్రీరాముని రూపం చూపిస్తాడు. ఆ గాధను అంతా భీమసేనుడికి వివరించిన హనుమ, మరలా శ్రీరామ సంకీర్తనం చేస్తూ ఉంటాడు. ఆంజనేయ చరిత్ర ఎక్కువ భాగం రామునితో ముడిపడి ఉండడం చేత ఈ చిత్రంలో ఆంజనేయుని చరిత్రలో భాగంగా సీతాన్వేషణ నుండి రామ కధ అంతా మనకు కనిపిస్తుంది.

ధన్యవాదాలు –తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి