శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి మూవీ

శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి మూవీ గురు స్వరూపంగా దత్తాత్రేయడు. ప్రకృతిధర్మం ఆచరించిన ఋషి దంపతులకు సంతానంగా వచ్చిన పరబ్రహ్మ స్వరూప భక్తిమూవీకధ.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

తెలుగు సినిమా నిర్మాణ బ్యానర్: శ్రీదత్త సచ్చిదానంద ప్రొడక్షన్స్

తెలుగు మూవీ పేరు : శ్రీ దత్త దర్శనము భక్తిమూవీ

నటినటులు: రంగనాథ్, శివకృష్ణ, గుమ్మడి, ప్రభాకర రెడ్డి, రమణమూర్తి, వీరభద్రరావు, ద్వారకానాథ్, ఆచంట వెంకటరత్నం నాయుడు, మాస్టర్ గురుప్రసాద్, K.R. విజయ, ప్రభ, జయంతి, కాంచన, చలపతిరావు, ఈశ్వరరావు, టెలిఫోన్ సత్యనారాయణ, శివాజీ, జ్యోతిర్మయి, జయలలిత, జయవాణి, నిర్మల, సిల్క్ స్మిత తదితరులు నటించారు.

తెలుగు పాటలు: వేటూరి

తెలుగు సినిమా పాటలు గానం: SP బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్, సుశీల, వాణిజయరాం, మంగళంపల్లి బాలమురళి కృష్ణ.

తెలుగు సినిమా సంగీతం: K.V. మహదేవన్

శ్రీదత్త దర్శణం తెలుగు మూవీ నిర్మాత: K.C. తల్వార్

శ్రీదత్త దర్శణం తెలుగు సినిమా దర్శకత్వం: కమలాకర కామేశ్వర రావు

శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి మూవీ కథ

శ్రీదత్తయంత్ర దర్శనంతో భక్తిమూవీ ప్రారంభం ఉంటుంది. ప్రారంభ సన్నివేశంలో మునిదంపతుల తపోదీక్షకు లోకాలు తల్లడిల్లుతుంటే నారద మహర్షి కంగారుగా నారాయణ మంత్రం జపిస్తూ వైకుంఠము వెళ్ళడం, అక్కడ త్రిమూర్తులు ఒకేచోట నారద మహర్షికి దర్శనం ఇస్తారు. అయితే అలా తపస్సు చేసే మునిదంపతుల పేర్లు అత్రి-అనసూయ వారికోరిక త్రిమూర్తల స్వరూపమే పుత్రసంతానంగా పొందాలని.

నారద సూచన తరువాత త్రిమూర్తులు అత్రిమహర్షి తపస్సు చేసే చోటకి వచ్చి, అత్రిని పిలుస్తారు. అత్రివారిని స్తుతించిన తరువాయి త్రిమూర్తులు అత్రికోరిక తీర్చడం కోసం ముగ్గురు మూర్తులు ఒక బాలమూర్తిగా మారి అత్రికి దర్శనం ఇస్తారు. అయితే అత్రి మహర్షి అంతర్యం గ్రహించిన ఆ బాలమూర్తి కొంతకాలం వేచిచూడండి నేను మీ కడుపునా పుడతాను అని చెప్పి అంతర్ధానం అవుతాడు.

తరువాయి సన్నివేశంలో ప్రతిరోజూ జరిగే సూర్యోదయం ఆరోజు జరగదు, మునులు, సాధువులు, సంసారులు నిత్యకర్మలకు ఆటంకం ఏర్పడుతుంది. అప్పుడు నారదాది మునులు అంతా కలసి అత్రి మహర్షి భార్య అయిన అనసూయ దగ్గరికి వస్తారు. జగమంతా అంధకారం అయ్యింది, ప్రకృతి అల్లాడుతుంది, ఈ ఘోరం నుండి కాపాడేవారు ఎవరూ లేరు తల్లి నీవే దిక్కు అని అంటారు. అప్పుడు అనసూయ ఆలోచన చేస్తుంది, సూర్యుని క్రమాన్నే కట్టడి చేసిన ఆ సాద్వి ఎవరు అని.

సుమతి కధలో అనసూయ మహిమ – త్రిమూర్తలు వరప్రసాదంగా గురుదత్త జననం

అప్పుడే మనకి మహా ప్రతివ్రత అయిన సుమతి కధ ప్రారంభం అవుతుంది, ఈ మూవీలో కుష్టి వ్యాదిగ్రస్తుడైన భర్తకు సుమతి సేవలు చేస్తూ ఉంటుంది. భర్త చీదరించిన, ఆదరించిన భర్తే దైవంగా సేవలు చేస్తూ ఉంటుంది. వ్యాదిగ్రస్తుడైన కౌశికుడు ఒకవేశ్యను చూసి మోహించి, ఆ వేశ్య పొందు కావాలని తన భార్య సుమతితో పట్టుబట్టి చెబుతాడు. ఆ సూర్యాస్తమయం తరువాత తన భర్తను ఒక తట్టలో నెత్తిమీద పెట్టుకుని భర్తను వేశ్యవద్దకు తీసుకుపోవడానికి బయలుదేరుతుంది.

అదే దారిలో ఒకచోట మాండవ్య ముని కొరతవేయబడి ఉండి, మౌనంగా తపస్సు చేస్తూ ఉంటాడు, భర్తను నెత్తిన మోస్తున్న సుమతి అటుగా నడుస్తూ ఉండగా కౌశికుడు కాళ్ళు కదల్చుతూ ఆ మాండవ్యమునిని తన్నడంతో, మునికి భాద ఎక్కువై, ఆ కౌశికుడిని సూర్యాస్తమయం లోపు మరణిస్తాడని శాప వాక్కు ఇస్తాడు. అయితే సుమతి సూర్యోదయం కాకూడదని ప్రకృతిని శాసిస్తుంది, తనప్రాతివత్య శక్తితో.

విషయం గ్రహించిన అనసూయ, నారదాది మునులు సుమతి ఇంటికి వచ్చి, సుమతిని వేడుకుంటారు, సూర్యోదయానికి అనుమతిని ఇమ్మని. సుమతి తనభర్తకు ఉన్న శాపం గురించి అనసూయతో చెబుతుంది. అనసూయ ఆమె భర్త గురించి హామీ ఇవ్వగానే, సుమతి సూర్యోదయానికి అనుమతిస్తుంది, వెంటనే ఆమె భర్త మరణిస్తాడు, వెంటనే సుమతి క్రింద పడిపోతుంది. అప్పుడు అనసూయ మహాసాద్వి ప్రాతివత్య శక్తితో కౌశికుడుని బ్రతికిస్తుంది. దేవతలు సంతషించి అనసూయను మాతా అని సంభోదిస్తారు, త్రిమూర్తులు వచ్చి వరం కోరుకో అంటే, అనసూయ మహాసాద్వి కూడా పుత్రసంతానం అడుగుతుంది. త్రిమూర్తులు తదాస్తు పలికి అంతర్ధానం అవుతారు. అత్రిమహాముని నిశ్చయించిన శుభముహూర్తాన దత్తుడు జన్మిస్తాడు.

ఇంద్రుడికి శ్రీదత్త దర్శనం

త్రిమూర్తుల అంశతో జన్మించిన దత్తాత్రేయుడు సహజంగా జ్ఞానసంపన్నుడుగా ఉంటాడు. ఒకచోట చిన్నపిల్ల చనిపోయి ఏడుస్తున్న తల్లిని చూసి దత్తాత్రేయుడు ఆ పిల్లను పిలిచి బ్రతికిస్తాడు. ఒక చోట ఒక సాధువు తపస్సుకు ప్రయత్నిస్తూ ధ్యానంలో నిమగ్నం కాలేక సతమతం అవుతూ ఉంటాడు, పదేళ్ళ నుండి. అప్పుడు అటుగా వస్తున్న దత్తాత్రేయుడు ఆ సాధువు దగ్గరకొచ్చి విషయం తెలుసుకుని, ఆ సాధువు నుదురుపై ముట్టుకోగానే ఆ సాధువు సమాదిస్థాయిలో ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అలా మహిమలు చూపుతూ శ్రీదత్తాత్రేయుడు తపస్సులోనే పెరుగుతాడు. తపస్సులోనే సమాధి స్థితిని పొంది, బ్రహ్మజ్ఞానిగా నిలబడతాడు.

అత్రి ఆశ్రమంలో అనసూయ పుత్రునిపై ఆలోచనలో ఉండగా దత్తాత్రేయుడు అమ్మా అంటూ వస్తాడు. లోనికి ఆహ్వానించిన అమ్మని సహ్యాద్రి పర్వతాలపై ఉండేందుకు అనుమతి భిక్ష అడుగుతాడు. అంగీకరించని అమ్మకి ఆత్మలేని దేహస్థితిని చూపి, అమ్మ దగ్గర అనుమతిని పొంది, గురుదత్తగా తండ్రిదగ్గర కూడా అనుమతి తీసుకుని సహ్యాద్రి పర్వతాలకు పయనం అవుతాడు, దత్తాత్రేయుడు.

జంబాసురుడు దండయాత్రకు తల్లడిల్లిన ఇంద్రుడు బ్రహ్మలోకం బయలుదేరితే, మధ్యలో నారదుడు ఇంద్రుడిని ఆపి జంబాసురుడిని త్రిమూర్తులు ఏమి చేయలేరు. అటువంటి వరాలు జంబాసురుడికి ఉన్నాయి, నీవు  సహ్యద్రిలో ఉన్న దత్తాత్రేయస్వామిని దర్శించమని సూచిస్తాడు. అయితే దత్తాత్రేయుడు కఠిన పరిక్షలు ఎదుర్కుంటేనే దర్శనం ఇస్తాడు, సులభంగా దత్త దర్శనం కాదు అని సమాచారం ఇస్తాడు.

దత్తాత్రేయస్వామి ఆశ్రమానికి వచ్చిన ఇంద్రుడికి దత్తాత్రేయుడు కొంతమంది మహిళలతో మద్యం సేవిస్తూ కనిపిస్తాడు. కానీ ఇంద్రుడు ఆయనని దత్తాత్రేయుడు అని భావించి, శ్రీదత్తుడి పాదాలు వదలడు. అనఘాదత్తాత్రేయులను స్తుతించి అనుగ్రహం సంపాదిస్తాడు. జంబాసురుడి గురించి వివరించగా, దత్తాత్రేయుడు, నేను సహ్యాద్రి విడిచి రాను అతన్ని ఇక్కడికి తీసుకురా, అంతం చేస్తాను అని చెబుతాడు.

ఇంద్రుడు జంబాసురుడిని సహ్యాద్రి పర్వతలవైపు, శ్రీదత్తుడి ఆశ్రమం దగ్గరికి తీసుకువస్తాడు. సహ్యాద్రికి వచ్చిన జంబాసురుడు అమ్మని అనఘాదేవినే కోరి తన నాశనం తానే కొనితెచ్చుకుంటాడు. అమ్మఅనఘాదేవి జంబాసురుడి తలపై నృత్యం చేయడం, అతను అంతం అవ్వడం జరుగుతుంది. తరువాత దేవేంద్రులకు శ్రీదత్తదర్శన భాగ్యం కలుగుతుంది.

విష్ణుదత్తుడిపై దత్తాత్రేయుల అనుగ్రహం

విష్ణుదత్తుడు ఒక సద్బ్రాహ్మనుడు ఒకరోజు ప్రసాదం చెట్టుకింద పెట్టి లోపాలకి వెళుతుంటే, ఆ చెట్టుపైన ఉన్న రాక్షసుడు విష్ణుదత్తుడిని పిలుస్తాడు. కంగారుపడిన విష్ణుదత్తుడితో నీవు నాకు ఉపకారం చేసావు, నీకు ప్రత్యుపకారం చేస్తాను అని అంటాడు ఆ బ్రహ్మరాక్షసుడు. కానీ నిత్యతృప్తుడైన విష్ణుదత్తుడు తనకి ఏకోరిక లేదని చెబుతాడు, కానీ పట్టువదలని ఆ బ్రహ్మరాక్షసుడిని శ్రీదత్తదర్శనం చేయించమని అడుగుతాడు. బ్రహ్మరాక్షసుడు కంగారుపడతాడు. మేము రాక్షసులం దత్తాత్రేయుడు అంటే మాకు భయం ఇంకేదైనా కోరిక కోరుకో అంటే మాకు ఇంకా ఏ కోరిక లేదని చెబుతారు విష్ణుదత్త దంపతులు. మాట ఇచ్చాను కాబట్టి దూరం నుండి మూడుమార్లు నీకు దత్తాత్రేయులవారిని చూపుతాను కానీ ప్రసన్నం చేసుకోవలసినది మాత్రం నీ భాద్యతే అని చెప్పి శ్రీదత్తదర్శనానికి బయలుదేరతారు.

దత్తాత్రేయ నివాసం దగ్గరికి విష్ణుదత్తుడిని తీసుకువెళతాడు బ్రహ్మరాక్షసుడు, అక్కడ దత్తాత్రేయుడు ఒక త్రాగుబోతుగా ప్రవర్తిస్తూ ఉంటే, విష్ణుదత్తుడు దత్తాత్రేయుడుని సంశయంతో చూస్తాడు. శ్రీదత్త దర్శనం జరగదు. రెండవమరు మళ్ళి బయలుదేరతారు శ్రీదత్త నివాసానికి, కానీ అక్కడ స్వామి కాటికాపరిగా ఉంటాడు. సంశయంతో భయంతో విష్ణుదత్తుడు శ్రీదత్తుడి పాదాలుపై పడితే, చేతిలో ఉన్న ఎముకతో కొట్ట్గాగానే క్రిందపడ్డ విష్ణుదత్తుడు స్వామిని ఆరూపంలో చూసి భయపడి పలాయన బాటపడతాడు.

మూడవమారు శ్రీదత్తదర్శనానికి బ్రహ్మరాక్షసుడు, విష్ణుదత్తుడు బయలుదేరతారు. దత్తత్రేయులు తననివాసంలో మరలా త్రాగుబోతుగా మద్యం సేవిస్తూ కనబడతాడు. వెంటనే విష్ణుదత్తుడు దత్తాత్రేయులవారి పాదాలుపై పడతాడు. స్వామి కొట్టినా, విదిల్చినా, తన్నినా పట్టువదలని విష్ణుదత్తుడిని శ్రిదత్తుడు అనుగ్రహించి దర్శనం ఇస్తాడు. స్వామిని చూసి పొంగిపోయిన విష్ణుదత్తుడు స్వామిపాదాలపై మరలా పడితే, వరం కోరుకో అని విష్ణుదత్తుడుని అడుగుతాడు శ్రీదత్తుడు. అప్పుడు తనతండ్రి పితృకర్మకు భోక్తగా రావలసినదిగా శ్రీదత్తాత్రేయులవారిని కోరతాడు.

విష్ణుదత్తుడి ఇంటికి శ్రీదత్తాత్రేయులవారు భోక్తగా వెళతారు. రెండవభోక్తని పిలవడం మరిచిన విష్ణుదత్త దంపతులు స్వామివారు గుర్తుచేసాక, విష్ణుదత్తుడి భార్య సుశీల ప్రార్ధనతో వాయుదేవుడు స్వరూపం రెండవభోక్తగా వస్తారు. మరల సుశీలమ్మ ప్రార్ధనతో విష్ణుస్థానంలో మూడవభోక్తగా అగ్నిదేవుడు వస్తారు. శ్రీదత్తాత్రేయులవారు ఇద్దరు బ్రాహ్మణులు భోజనం చేసాక వరం కోరుకోండి అంటే, బ్రహ్మరాక్షసుడుకి రాక్షసత్వం నుండి ముక్తిని ఇమ్మంటారు, డానికి నీకు అతను చేసిన సహాయం వలన ఆ రాక్షసుడు బ్రహ్మలోకం చేరాడు, కాబట్టి నీవు వరంకోరుకో అని అంటారు, శ్రీదత్తాత్రేయులవారు. విష్ణుదత్తుడి ఇతరకోరికలు లేకపోవడం వలన, స్వామియే అతని పూర్వీకులకు బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించి, విష్ణుదత్తుడిని అనుగ్రహిస్తారు. తనవిశ్వరూప దర్శనం విష్ణుదత్త దంపతులకి దక్కడం విశేషం.

కార్తవీర్యార్జునుడికి అనఘాదత్తాత్రేయుల దర్శనం

చేతులు సరిగా లేని రాజుని సింహాసనం అధిష్టించవలసినదిగా ఆ రాజ్య గురువులు కోరతారు, నేను సర్వశక్తిమంతుడైనతేనే సింహాసనం అధిష్టిస్తాను కానీ ఇలా పరాధీన అవస్థలో కాదు అనిఅంటాడు. అప్పుడు గురువులు ఆ రాజుకి శ్రీదత్తాత్రేయ స్వామి గురించి, స్వామి పెట్టే పరిక్షలు వివరించి, శ్రీదత్తదర్శనం చేసుకోమని చెబుతారు.

శ్రీదత్తదర్శనానికి వెళ్ళిన రాజుకి స్వామివారు మద్యం సేవిస్తూ త్రాగుబోతుగా కనిపిస్తారు. దగ్గరికి వచ్చిన రాజుని కొట్టినా తన్నినా పట్టువదలకుండా రాజు స్వామి పాదాలపై పడతాడు. శ్రీదత్తాత్రేయస్వామి ఆరాజుని అనుగ్రహించి వరం కోరుకో అని అంటే, ఆ రాజు అయిన కార్తవీర్యుడు తనకి తిరుగులేని శక్తులు ప్రసాదించమంటే, స్వామి అనఘా వ్రతాన్ని బోధించి ఆచరిస్తే, నీ కోరిక తీరుతుంది అని చెబుతారు. అప్పుడు కార్తవీర్య అర్జునుడు అనఘా వ్రతం చేసి, అనఘాదత్తదర్శనంతో సర్వశక్తిమంతుడు అవుతాడు. సహస్రబాహువులతో పాటు, తన రాజ్యంలో ఎవరిమనసులో ఏమి అనుకున్న తనకు తెలిసే వరం, మూడులోకాల్లో విహరించగలిగే శక్తిని, నీ స్వరూపమైన శక్తివంతుడి చేతిలో వీరమరణ వరం పొందుతాడు.

అనఘా వ్రతం రాజ్యంలో అందరూ ఆచరించి తరించాలని కార్తవీర్యార్జునుడు శాశనం చేస్తాడు. అయితే ఆ రాజ్యంలో రాములు అనే చెప్పులుకుట్టుకునే దంపతులకు అనఘావ్రతం చేసుకుందాం అని అనుకుంటారు. ఆ ఊరి పురోహితుడుని ఆ వ్రతం చేసుకుంటాం అని అంటే, మీలాంటివారు వ్రతం కాదు అని చెప్పి పంపించేస్తారు. ప్రజలు మనోభావాలు తెలుసుకునే శక్తిగలిగిన కార్తవీర్యార్జునుడుకి ఈ విషయం అవగతమవుతుంది.

ఒక పేదవానికి దత్తాత్రేయులవారే పూజచేయించడం

ఆ రాములు దంపతుల ఇంటివైపు ఒక బ్రాహ్మణస్వామి వస్తూ ఆ దంపతులకి కనబడితే, వారు ఆ స్వామివారిని అనఘా వ్రతం చేయించమని వేడుకుంటారు. బ్రాహ్మణాస్వామిగా వచ్చిన దత్తాత్రేయులవారు తనమహిమతో వట్టిపోయిన గోవునుండి కూడా పాలు వచ్చేలా చేసి, అనఘా వ్రతం ఆ దంపతులచేత పూర్తీచేయిస్తారు.  ఆ సమయంలోనే ఆ ఊరి పురోహితులు అటుగా వచ్చి, ఆ బ్రాహ్మణస్వామితో గొడవకు దిగితే, మహారాజు కార్తవీర్యార్జునుడు అక్కడికి వచ్చి స్వామిని ప్రార్ధించి, క్షమాపణ కోరతాడు. స్వామి అనుగ్రహించి నిజదర్శనం కనబడతారు.

వరప్రభావంతో కార్తవీర్యార్జునుడు ఆకాశవీధిలో వెళుతూ, ఇంద్రుని చూసి అతని ప్రవర్తనను తక్కువగా చూసి వెళతాడు. ఆగ్రహించిన ఇంద్రుడు కార్తవీర్యార్జునుడి సభలోకి అగ్నిదేవుడిని బ్రాహ్మణుడిగా పంపి, ఆకలి తీర్చమని అడగమంటాడు. అందుకు ఒప్పుకున్నా కార్తవీర్యార్జునుడి పర్యవేక్షణలో అగ్ని కొన్ని ఇళ్ళను, ఆశ్రమవాసులను దహిస్తుంటే, చూసిన వశిష్టముని ఆగ్రహించి, ఒక ముని కుమారుని చేతిలో నీకు మరణం సంభవిస్తుంది అని శాపం ఇస్తాడు. అయితే ఎంతవారు అయినా కాలంలో అహంకారం వస్తుంది అని కార్తవీర్యార్జునికి వస్తుంది.

పరశురాముడు కార్తవీర్యార్జునుల యుద్ధం

జమదగ్ని ముని ఆశ్రమంలో ఆతిద్యం స్వీకరించిన కార్తవీర్యార్జునుడు, పంచబక్ష్య భోజనాలు రాజు, రాజపరివారానికి సృష్టించిన సురభి గోవుని చూసి, ఆ గోవుని తనవెంట తీసుకువెళ్లాలని అనుకుంటాడు. జమదగ్నిమునిని అడిగితే ముని ఆవు దైవదత్తమని, ఇవ్వడం సబబు కాదని హితవు చెబుతాడు. కానీ వినని ఆ మహారాజు సురభిగోవుని రాజధానికి తోడ్కుని వెళతాడు. గోవు కంటతడి పెడుతుంది. అదే అతని పతనానికి పెద్ద కారణం అవుతుంది. వరబలం కూడా అహం పెంచుతుంది అని ఇక్కడ తెలియపరుస్తుంది.

జమదగ్నిముని కుమారుడు అయిన భార్గవరాముడు గండ్రగొడ్డలితో కార్తవీర్యార్జునుడిపైకి యుద్దానికి వస్తాడు. సుదర్శన చక్రం గర్విస్తే శాపవశాన కార్తవీర్యార్జునిడిగా జన్మించిన ఆ మహారాజుకి గతం గుర్తుకు వచ్చి భార్గవరాముని చేతిలో మరణిస్తాడు. తిరిగి సుదర్శన చక్రంగా శ్రీమహావిష్ణువు చేతిలోకి వెళతాడు. కార్తవీర్యార్జునుడి కుమారులు వచ్చి జమదగ్ని తలను నరికి వెళ్ళిపోతారు. అప్పుడు జమదగ్ని భార్య రేణుకామాత రామ రామ రామ రామ అంటూ 21 మార్లు అరుస్తూ ఉంటుంది. అన్నిమార్లు భూమండలం అంతా గర్వం కలిగిన రాజులందరిని చంపుతానని ప్రతిజ్ఞా చేస్తాడు.

తల్లిదండ్రులను కావిడిలో పెట్టుకుని ఆ కావిడిని భుజానికెత్తుకుని భార్గవరాముడు బయలుదేరతాడు. మధ్యలో ఆకాశవాణి పిలుపు వినపడిన చోట తల్లిదండ్రులను పెట్టి, భార్గవరాముడు శ్రీదత్తదర్శనానికి వెళతాడు. అక్కడ శ్రీదత్తుడు శునకాలతో ఆడుకుంటూ ఒక అంటారని వ్యక్తిలాగా కనిపిస్తాడు. కానీ భార్గవరాముడు స్వామిగురించి తనతండ్రి నోట విని ఉండడం వలన సందేహం లేకుండా ఆ స్వామినే ప్రార్ధిస్తాడు. దత్తాత్రేయుల వారు భార్గవరాముడిని అనుగ్రహింఛి తల్లి రేణుకమాతా దర్శనం కోసం వెళతారు, స్వామి దత్తాత్రేయులు. రేణుకాజమదగ్ని దంపతుల దహన సంస్కారం తరువాయి, పరశురాముడుగా తన ప్రతిజ్ఞా నేరవేర్చుతాడు.

భార్గవరాముడు పరశుని చేపట్టి అనేకమంది రాజులను చంపడం వలన పరశువుతో పాపం మూటకట్టుకున్నట్టు ఆకాశవాణి ద్వారా నీవు పరశురాముడిగానే మిగిలిపోతావు అని మాటలు వినబడతాయి. తత్ఫలితంగా తన స్థితిని గుర్తించిన పరశురాముడు మరలా శ్రీదత్తదర్శనం పొంది, దత్తాత్రేయుల ద్వారా తత్వబోధ అనంతరం భార్గవరాముడు శాంతిని పొందుతాడు. శ్రీదత్త విశ్వరూప దర్శనంతో చిత్రం సుఖాంతం అవుతుంది.

శ్రీదత్తదర్శనం అంటే పరమాత్మదర్శనంగానే ఉండడం ఈ భక్తి మూవీ యొక్క పరమార్ధంగా కనిపిస్తుంది.

ధన్యవాదాలు తెలుగురీడ్స్.కామ్
తెలుగురీడ్స్ మొబైల్ యాప్స్ డౌన్ లోడ్ చేయండి

బిజినెస్ లిస్టింగ్ ఇన్ తెలుగురీడ్స్.కామ్ తెలుగులోనే

లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్

టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020

కరోనా వైరస్ పరిచయం చేసిన లాక్ డౌన్ 2020లో కోవిడ్19 వ్యాప్తితో

వెబ్ సైట్ షార్ట్ కట్స్ ఇన్ ఒన్ స్క్రీన్